
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా తొలుత కాళేశ్వరం చేరుకున్న సీఎం, అక్కడ కొలువై ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ఏకంగా 198 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.
అనంతరం అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్దకు సీఎం చేరుకున్నారు. అక్కడ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీ తాజా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇరిగేషన్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ పునర్నిర్మాణంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో మరో ప్రధాన ఘట్టం నస్తూరిపల్లి బహిరంగ సభ. కాటారం మండలం నస్తూరిపల్లిలో ఏర్పాటు చేసిన భారీ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇదే వేదిక నుంచి తెలంగాణ రైతాంగానికి తీపి కబురు అందిస్తూ.. ‘రైతుభరోసా’ రెండో విడత నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. అటు ఆలయ అభివృద్ధి, ఇటు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, మరోవైపు రైతులకు ఆర్థిక భరోసా.. ఇలా ముచ్చటగా మూడు కీలక కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనకు సంబంధించిన క్షణక్షణ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.




