
నూరేళ్ల పంట కావాల్సిన వివాహ బంధం.. మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. పచ్చని సంసారాల్లో మనస్పర్థల చిచ్చు రేగుతోంది. కడప జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే.. మనుషుల మధ్య సహనం నశిస్తోందా? క్షణికావేశం పసి ప్రాణాలను అనాథలుగా చేస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు.. కత్తులతో దాడి చేసుకుంటున్నారు, లేదా ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలు మన కుటుంబ వ్యవస్థ ఎటు పోతోంది? ఇప్పుడు దీనిపై ఓ ప్రత్యేక కథనం
జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చెన్నూరు మండలానికి చెందిన దంపతులే దీనికి నిదర్శనం. భర్త ఒక షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు.. ఎంతో అందమైన ప్రపంచం. కానీ, చిన్న గొడవ వారి మధ్య చిచ్చు పెట్టింది. మనస్తాపంతో భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే, అదే బాధతో భార్య కూడా పట్టాలపైకి వెళ్లి ప్రాణాలు విడిచింది. ఆ క్షణంలో వారికి తమ బిడ్డల భవిష్యత్తు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కళ్లముందే తల్లిదండ్రులు ఉన్నా.. ఆ పసిపాపలకు ఇప్పుడు దిక్కులేకుండా పోయింది.ఇక ప్రొద్దుటూరులో జరిగిన మరో ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. భార్య లావుగా ఉందని, తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న ఒక భర్త.. పాలకోవాలో విషం కలిపి ఆమెను కడతేర్చాడు. ఇటు తల్లి మరణం, అటు తండ్రి జైలు పాలు.. మధ్యలో ఒక ఆడబిడ్డ అనాథగా మిగిలిపోయింది. మరోవైపు వివాహేతర సంబంధాల వ్యామోహంలో పడి, కట్టుకున్న భర్తనే చంపడానికి కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చిన ఘటనలు వింటుంటే సమాజం ఏ దిశగా వెళ్తోందో అర్థం కావడం లేదు.అంతేకాదు, మార్చి నెలలో జరిగిన హృదయ విదారక ఘటన మరొకటి ఉంది. భర్త వదిలేసి వెళ్ళాడన్న ఆవేదనతో, అత్తింటి అవమానాలు భరించలేక ఒక తల్లి తన ముగ్గురు బిడ్డలకు విషం తాగించి, తాను కూడా తాగి తనువు చాలించింది. ఆ పసి బిడ్డల తప్పేంటి? వారు ప్రపంచాన్ని కూడా చూడకముందే మృత్యుఒడికి చేరుకున్నారు. పెద్దలు చేసే తప్పులకు పిల్లలు శాపగ్రస్తులవుతున్నారు. అహంకారం, అనుమానం, ఆవేశం.. ఈ మూడు కట్టుకున్న బంధాలను తుంచేస్తున్నాయి.”
చిన్న చిన్న గొడవలను కూర్చుని మాట్లాడుకోవాల్సిన పెద్దలే, విడాకులు లేదా హత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరిన్ని ప్రాణాలు గాల్లో కలవడం, మరిన్ని పసి హృదయాలు అనాథలుగా మిగలడం ఖాయం. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి. బంధాలకు విలువనివ్వాలి.”




