“మురుగులో గుంటూరు! 9 ఏళ్ల నిరీక్షణ.. ఇంకా రూ.550 కోట్లు కావాలా?

ముందుకు కదలదు.. మురుగు వదలదు! ఇది గుంటూరు నగర భూగర్భ మురుగునీటి వ్యవస్థ పరిస్థితి. నగరమంతా పరిశుభ్రంగా ఉంటుందని కలలుగన్న నగరవాసులకు.. తొమ్మిదేళ్లుగా ఎదురుచూపే మిగిలింది. వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? నిధుల గండం ఎప్పుడు తప్పుతుంది? ఇప్పుడు దీనిపై ప్రత్యేక కథనం.”

గుంటూరు నగర రూపురేఖలు మార్చాలని, మురుగు ఆనవాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యూజీడీ పనులకు శ్రీకారం చుట్టింది. అంచనా వ్యయం రూ.854 కోట్లు. 2019 నాటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసింది. నిర్మాణ సంస్థకు రూ.54 కోట్ల బకాయిలు పెట్టి, ప్రాజెక్టు గతిని మార్చేసింది. పనులు ఆగిపోవడమే కాదు.. వేసిన పైపులైన్లు ఇప్పుడు శిథిలమవుతున్నాయి.భూగర్భంలో వదిలేసిన మ్యాన్‌హోల్స్, ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు దాదాపు 20 శాతం వరకు దెబ్బతిన్నాయని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న సీవరేజీ ప్లాంట్లు కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, పెరిగిన ధరల ప్రకారం ఈ పనులు పూర్తి కావడానికి అదనంగా మరో రూ.550 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు.ఈ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఐదు ఎస్టీపీలకు రూ.90 కోట్లు, జోన్ 1 మరియు 2లలో పైపులైన్ల పూర్తికి రూ.127 కోట్లు అవసరమని తేల్చారు. అలాగే పాత పనుల మరమ్మతులకు రూ.13 కోట్లు, తొమ్మిదేళ్ల నిర్వహణకు మరో రూ.120 కోట్లు కేటాయించాల్సి ఉంది. నిధుల గండం ఒకవైపు, శిథిలమవుతున్న నిర్మాణాలు మరోవైపు గుంటూరు వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొమ్మిదేళ్ల నిరీక్షణకు ఇకనైనా తెర పడుతుందో లేదో చూడాలి.”

నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే గుంటూరు వాసులకు మురుగు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మరి అధికారులు, పాలకులు ఈ ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తి చేస్తారో వేచి చూడాలి. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *