
“ప్రభుత్వ భూమి అంటే పరాయి భూమి కాదు.. అది ప్రజల ఆస్తి. కానీ ఆనందపురం మండలంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. భూబకాసురులు ఎక్కడికక్కడ పాగా వేస్తుంటే.. రక్షించాల్సిన అధికారులే వారికి రక్షణ కవచంలా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇస్తే చాలు.. అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ సిబ్బంది పచ్చజెండా ఊపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఆనందపురంలో ఏం జరుగుతోంది? భూదందా వెనుక ఉన్నదెవరు? ఇప్పుడు చూద్దాం.”
విశాఖ జిల్లా ఆనందపురం పరిధిలో భూదందా మళ్లీ పడగ విప్పింది. కొంతకాలం క్రితం వరకు ఫిర్యాదుల నేపథ్యంలో స్తబ్ధుగా ఉన్న అక్రమార్కులు, ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ జెండాలు పాతేస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతూ సామాన్యుల ఆస్తులను సైతం గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అవినీతి అధికారులు అక్రమార్కుల నుంచి భారీగా ముడుపులు అందుకుని, ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. సమాధానాలు దాటవేయడం పరిపాటిగా మారింది. ‘గతంలో జరిగిందే కదా.. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదాహరణకు కణమాం గ్రామంలో జరిగిన సంఘటన అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. అక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఒక వ్యక్తి పదేపదే ఫిర్యాదు చేస్తే, ఒత్తిడి తట్టుకోలేక ఒక స్లాబు ఇంటిని పాక్షికంగా తొలగించి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత లోపాయికారీ ఒప్పందాలతో ఆ చర్యలను అక్కడితోనే నిలిపివేశారు. మళ్లీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.భూముల రక్షణ కోసం పనిచేయాల్సిన వ్యవస్థే కబ్జాదారులకు సహకరిస్తుంటే, ఇక సామాన్యులకు దిక్కెవరు? తహసీల్దార్ శ్రీనుబాబును వివరణ కోరగా.. ‘పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని రొటీన్ సమాధానం ఇచ్చారు. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదు.”




