
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన భర్తే.. కాలయముడిగా మారాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న వాడన్న కనికరం లేకుండా, పగతో రగిలిపోతూ రక్తం ఏరులై పారేలా దాడి చేశాడు. అసలు ఆ దంపతుల మధ్య ఏం జరిగింది? నడిరోడ్డుపై అంతటి దారుణానికి సాంబయ్య ఎందుకు పాల్పడ్డాడు? ఉయ్యూరును వణికించిన ఈ హత్యాయత్నం వెనుక ఉన్న భయంకర నిజాలేంటి? నేటి మన క్రైమ్ స్పెషల్.. “కట్టుకున్నవాడే కాలయముడు – ఉయ్యూరులో నడిరోడ్డుపై కిరాతకం!
కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణం.. నిత్యం రద్దీగా ఉండే కాటూరు రోడ్డు అది. అందరూ తమ పనుల్లో తాము నిమగ్నమై ఉన్న వేళ, ఒక్కసారిగా హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పుష్పవతి అనే మహిళపై ఆమె భర్త సాంబయ్య అత్యంత క్రూరంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళ్లముందే భార్య కనిపిస్తుంటే, గుండెల్లో గూడుకట్టుకున్న పగ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, సాంబయ్య పెద్ద బండరాయితో పుష్పవతి తలపై బాదాడు.రక్తపు మడుగులో కుప్పకూలిన ఆ మహిళ అరుపులు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాంబయ్య మృగంలా ప్రవర్తిస్తూ, ఆమెను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా దాడిని కొనసాగించాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పుష్పవతిని వెంటనే చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.అసలు ఈ దారుణానికి గల కారణాలను విశ్లేషిస్తే.. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. సాంబయ్య, పుష్పవతి ఇద్దరూ గొడవల కారణంగా వేర్వేరుగా నివసిస్తున్నారు. అయితే, ఈ దూరం సాంబయ్యలో పశ్చాత్తాపాన్ని పెంచాల్సింది పోయి, పగను పెంచింది. ఆమెపై ఉన్న కోపంతో అదను చూసి ఈ దారుణానికి ప్లాన్ చేశాడు. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడికి తెగబడటం చూస్తుంటే, అతడికి చట్టం అన్నా, పోలీసులన్నా ఎంత భయం లేదో అర్థమవుతోంది.సమాచారం అందుకున్న వెంటనే ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సాక్ష్యాలను సేకరించారు. సాంబయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇలా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరడం స్థానికంగా కలకలం రేపుతోంది. రక్షణ కల్పించాల్సిన భర్తే ప్రాణాలు తీయాలని చూడటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.




